చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ పై అనుచిత వ్యాఖ్యలు.. కొడాలి నానిపై విచారణకు ఏపీ ప్రభుత్వం అనుమతి

  • 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నాని అనుచిత వ్యాఖ్యలు
  • అప్పట్లో నానిపై విచారణకు అనుమతిని ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
  • కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు విచారణకు అనుమతించిన ప్రభుత్వం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ఘాటు వ్యాఖ్యలతో, బూతు పురాణాలతో నిత్యం వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి కొడాలి నానికి కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నాటి పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ఎస్‌ఈసీ (రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి) నిమ్మగడ్డ రమేశ్‌, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కొడాలి నాని చేసిన అత్యంత దారుణమైన వ్యాఖ్యల కేసులో.. ఆయనపై క్రిమినల్ విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


పూర్తి వివరాల్లోకి వెళితే... 2021 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి... "చంద్రబాబును మెడపట్టి ఈ రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ దూషణలకు దిగారు.


ఈ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దారుణంగా ఉల్లంఘించడమేనని నాటి ఎస్‌ఈసీ సంయుక్త కార్యదర్శి కృష్ణా జిల్లా ఎస్పీకి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో గుడివాడ పోలీసులు స్థానిక కోర్టు అనుమతి తీసుకుని 2021 ఫిబ్రవరి 16న కొడాలి నానిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మంత్రి పదవిలో ఉన్నప్పుడు... ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు విచారణకు స్వీకరించాలన్నా, పోలీసులు ఛార్జ్‌షీట్ వేయాలన్నా ప్రభుత్వం నుంచి కచ్చితంగా ప్రాసిక్యూషన్ అనుమతి తీసుకోవాలి. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వకుండా ఆ ఫైల్‌ను తొక్కిపెట్టారు.


ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పాత కేసుల ఫైళ్లు కదిలాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన హోంశాఖ... కొడాలి నానిపై చర్యలు తీసుకునేందుకు ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఈ మేరకు కోర్టులో విచారణ వేగవంతం చేసేందుకు వీలుగా కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.


Kodali Nani
Chandrababu Naidu
Nimmagadda Ramesh Kumar
Andhra Pradesh Government
Kodali Nani Prosecution
Gudivada Criminal Case

More Telugu News